విద్యాశాఖ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు

విద్యాశాఖ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు

హైదరాబాద్, వెలుగు: గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్లో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణాకు బుధవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సొసైటీలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి మూడు నెలల్లో నివేదిక సమర్పించాలని ప్రజాహిత వ్యాజ్యంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై డి. రవీందర్ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్తో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్కు ఆవరణలో ప్రభుత్వానికి చెందిన 100 ఎకరాలు ప్రభుత్వ రికార్డుల్లో కనిపించడంలేదన్నారు. ఈ అక్రమాలపై పిటిషనర్ ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారని, విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించినా అమలు కాలేదన్నారు. వాదనలను విన్న ధర్మాసనం ప్రతివాది యోగితారాణాకు నోటీసులు జారీ చేస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.